ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే చంపేసిన కసాయితల్లి!

ప్రియుడి మోజులో పడ్డ ఓ యువతి రాక్షసిగా మారిపోయింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకుమార్తెను కిరాతకంగా చంపేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో ప్రియుడితో పాటు కసాయి తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని వాణియంబాడి నేతాజీనగర్‌కు చెందిన నళిని (26)కి బెంగళూరుకు చెందిన శివకుమార్ కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు జీవిత్(6), జస్వంత్(5)తో పాటు ఏడాదిన్నర వయస్సున్న రిత్విక అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం నళిని వాణియంబాడిలో తల్లి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన మురళితో నళినికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.

అయితే రెండ్రోజుల క్రితం రిత్విక అనారోగ్యం పాలయింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. అయితే పాప శరీరంపై గాయాలు ఉండటాన్ని గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిన్నారి మరణంపై విచారణ ప్రారంభించారు.

తొలుత తనకు ఏమీ తెలియదని బుకాయించిన నళిని.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే ఈ హత్య చేశానని ఒప్పుకుంది. ఇద్దరం చెన్నైకి వెళ్లిపోయి బతుకుదామనీ, పాప వద్దని మురళి చెప్పడంతోనే పాపను కొట్టి చంపేసినట్టు, చెప్పి భోరున విలపించింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *