బాలిక‌ల హాస్ట‌ల్స్ వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తాం : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్

విద్యార్ధినులు ఎంతో బ‌ల‌మైన సంక‌ల్పంతో కూడిన వ్య‌క్తిత్వంతో ముందుకి వ‌స్తున్నారు. వారంద‌రికీ బంగారు భ‌విష్య‌త్తు ఉండాల‌ని ఆకాంక్షిస్తూ, ఆడ‌ప‌డుచుల మాన‌ప్రాణ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను జ‌న‌సేన పార్టీ తీసుకుంటుంది. ఓ మ‌హిళ‌కి మాన‌భంగం జ‌రిగితే అక్క‌డ కూడా కులం ట్యాగ్ తీసుకువ‌చ్చే ప‌రిస్థితులు నేటి స‌మాజంలో ఉన్నాయి. అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండాలంటే ఆడ‌ప‌డుచుల‌కి చ‌ట్ట స‌భ‌ల్లో స్థానం క‌ల్పించాలి. అలాంటి మార్పుకి జ‌న‌సేన పార్టీ క‌ట్టుబ‌డి ఉంటుంది. స్కూల్స్‌లో టాయిలెట్స్ లేక చ‌దువులు మ‌ధ్య‌లోనే ఆపేస్తున్నారు. ప్ర‌తి స్కూల్లో టాయిలెట్స్‌తో పాటు బాలిక‌ల హాస్ట‌ల్స్ వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తాం. హాస్ట‌ల్స్ చుట్టూ బ‌ల‌మైన గోడ‌లు నిర్మించి భ‌ద్ర‌త క‌ల్పిస్తాం. అవ‌స‌ర‌మైన రూట్ల‌లో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తాం. మండ‌ల కేంద్రాల్లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో మ‌హిళా గైన‌కాల‌జిస్టులు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

అడ‌ప‌డుచుల‌కు, అక్క‌చెల్లెళ్ల‌కు అంత‌ర్జాతీయం మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. నా దృష్టిలో మ‌హిళ‌ల్ని గౌర‌వించ‌డానికి ఒక్క‌రోజు స‌రిపోదు. ఉమెన్స్ డే, మ‌దర్స్ డే అంటూ ఒక్క రోజుకే అది ప‌రిమితం కారాదు. నేను నా త‌ల్లిని నిత్యం గౌర‌విస్తా. మ‌హిళా దినోత్స‌వాలను ల‌క్ష్యం దిశగా చేయాలి. తూతూ మంత్రంగా నిర్వ‌హించ‌డం కాదు. ఏడాది పొడవునా మ‌హిళా సాధికారిత‌, వారి మాన‌ప్రాణ ర‌క్ష‌ణ దిశ‌గా ముందుకి వెళ్తామ‌ని చెప్ప‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం. నేను రాజ‌కీయాల్లోకి రావ‌డం వెనుక వున్న బ‌ల‌మైన కార‌ణాల్లో ఒక‌టి ఆడ‌ప‌డుచులపై జరుగుతున్న ఆకృత్యాలు. షూటింగుల‌కి వ‌చ్చే అమ్మాయిల ప‌ట్ల ఆక‌తాయి ప్ర‌వ‌ర్త‌న‌లు గానీ, ప‌సిబిడ్డ‌ల‌పై జ‌రుగుతున్న ఆకృత్యాల వంటివి న‌న్ను ఆలోచింప చేశాయి.

ఆడ‌ప‌డుచులు బ‌య‌టికి వెళ్తే ఇంటికి క్షేమంగా వ‌చ్చే రోజులు రావాల‌ని కోరుకుంటున్నా. ఆడ‌ప‌డుచుల‌కి భ‌ద్ర‌త లేన‌ప్పుడు ఎన్ని ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ వుంటే ఉప‌యోగం ఏంటి.?  గాంధీ మ‌హాత్ముడు కోరుకున్న‌ట్టు అర్ధ‌రాత్రి సంగ‌తి ప‌క్క‌న‌పెడితే, క‌నీసం ప‌ట్ట‌ప‌గ‌లు వీరంతా క్షేమంగా తిరిగేలా ఉండాల‌ని కోరుకునే స్థాయికి ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మార్పు తీసుకురావ‌డానికి ఓ ఎన్జీవో స్థాపిస్తే స‌రిపోదు. బ‌ల‌మైన చ‌ట్టాలు తీసుకురావాలి. అది రాజ‌కీయాల‌తోనే సాధ్యం. ఇలాంటి బ‌ల‌మైన కార‌ణాలే న‌న్ను రాజ‌కీయాల వైపు న‌డిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *