స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి సీపీఎం, సీపీఐ లు కావాలి కానీ, చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌డానికి అవ‌స‌రం లేదా..?

వామ‌ప‌క్ష పార్టీల‌కు 14 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ స‌భ స్థానాల‌ను కేటాయించిన‌ట్లు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లపై పలు చర్చల అనంత‌రం సీపీఎం పార్టీకి 7 శాస‌న‌స‌భ‌, రెండు లోక్ స‌భ స్థానాలు, సీపీఐ పార్టీకి 7 శాస‌న‌స‌భ‌, రెండు లోక్ స‌భ స్థానాల‌ను కేటాయించిన‌ట్లు తెలిపారు.

విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆదివారం సీట్ల స‌ర్దుబాట్ల‌పై సీపీఎం, సీపీఐ నాయ‌కుల‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఎంపీగా పోటీ చేయాలంటే  రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ. 50 కోట్లు ఉండాల‌న్న పిచ్చి లెక్క‌ల‌తో ప్ర‌జాస్వామ్యం అస్తవ్యస్తంగా త‌యారైంది. ధ‌న‌వంతులే చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్తే అణ‌గారిన వ‌ర్గాల‌కు న్యాయం ఎలా జ‌రుగుతుంది..? డ‌బ్బుతో చేసే రాజ‌కీయానికి ముగింపు ప‌ల‌కాలి. జనసేన, బిఎస్పీ, సి.పి.ఎం, సి.పి.ఐ.లతో కలిసి పోటీ చేస్తున్నాం. దానిలో భాగంగానే వామ‌ప‌క్షాల‌కు నాలుగు పార్ల‌మెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు ఆలోచించి ఇచ్చాం. స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి సీపీఎం, సీపీఐ పార్టీలు కావాలి కానీ, చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌డానికి వామ‌ప‌క్షాలు అవ‌స‌రం లేదా..?” అని ప్ర‌శ్నించారు.

సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ పి.మ‌ధు మాట్లాడుతూ “ఓ స‌రికొత్త రాజ‌కీయాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ఉద్దేశంతో, రాష్ట్రంలో నెల‌కొన్న టీడీపీ, వైసీపీల గుత్తాధిప‌త్య రాజ‌కీయాల్ని దెబ్బ‌తీయాల‌న్న ల‌క్ష్యంతో, డ‌బ్బు రాజ‌కీయాలకి స్వస్తి ప‌ల‌కాల‌న్న ఉద్దేశంతో ఓ మంచి కాంబినేష‌న్‌తో ముందుకి వ‌స్తున్నాం. ఒక సీటు అటుఇటు అయినా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల్ని కూట‌మి ప‌క్షాల‌న్నీ క‌ల‌సి ఉమ్మ‌డిగా ఎదుర్కొంటాం. ఈ పార్టీ కాక‌పోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాక‌పోతే ఈ పార్టీ అనే విధానాన్ని ఛేదించి మూడో రాజ‌కీయ శ‌క్తిని ఆవిష్క‌రించేందుకు బ‌ల‌మైన ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ పొత్తు అందుకు తోడ్ప‌డుతుంద‌ని నమ్ముతున్నాం. ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం”  అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ రామ‌కృష్ణ మాట్లాడుతూ “దేశ రాజ‌కీయాల్లో, రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు నాలుగు పార్టీలు క‌ల‌సి ఓ బ‌ల‌మైన కూట‌మిగా ఏర్పడ్డాయి. మోడీ ప్ర‌ధాని అయ్యాక ఏక‌ప‌క్ష విధానాలు ముందుకి తీసుకువెళ్లారు.  ముఖ్యంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రిగింది.  ప్ర‌త్యేక హోదా విష‌యంలోగానీ, విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలోగానీ అన్యాయం జ‌రిగింది. మోడీ ప్ర‌భుత్వం పోవాలి. ఇక రాష్ట్రంలో చంద్ర‌బాబు మాట‌ల గార‌డీ మిన‌హా చేసింది ఏమీ లేదు. అసెంబ్లీలో ఒక్క రోజు కూడా అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ప్ర‌తిప‌క్షం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యింది. ప్ర‌తిప‌క్ష నేత అసెంబ్లీకి వెళ్ల‌రు, ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద మాట్లాడ‌రు. కానీ జీతం మాత్రం తీసుకుంటారు. ఇప్పుడేమో మ‌ళ్లీ అధికారం కావాలంటారు. జ‌న‌సేన‌, బీఎస్పీ, వామ‌ప‌క్ష కూట‌మి ఓ స్ప‌ష్ట‌మైన విధానంతో ముందుకి వ‌స్తోంది. మార్పు కావాల‌నే వారు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌మ‌”ని విజ్ఞ‌ప్తి చేశారు.

పొత్తుల్లో భాగంగా సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల‌కి కేటాయించిన లోక్‌స‌భ‌, శాస‌న‌స‌భ స్థానాల వివ‌రాలు…

సి.పి.ఎం:అసెంబ్లీ స్థానాలు

1. కురుపాం (విజ‌య‌న‌గ‌రం జిల్లా)

2.  అర‌కు (విశాఖ‌ప‌ట్నం జిల్లా)

3. రంప‌చోడ‌వ‌రం (తూర్పుగోదావ‌రి జిల్లా)

4. ఉండి (ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా)

5. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌ (కృష్ణా జిల్లా)

6. సంత‌నూత‌ల‌పాడు (ప్ర‌కాశం జిల్లా)

7. క‌ర్నూలు (క‌ర్నూలు జిల్లా)

పార్లమెంటు స్థానాలు

1. క‌ర్నూలు

2. నెల్లూరు

సి.పి.ఐ:అసెంబ్లీ స్థానాలు

1. పాల‌కొండ‌ (శ్రీకాకుళం జిల్లా)

2. ఎస్‌.కోట‌ (విజ‌య‌న‌గ‌రం జిల్లా)

3. విశాఖ వెస్ట్‌  (విశాఖ‌ప‌ట్నం జిల్లా)

4.  నూజివీడు (కృష్ణా జిల్లా)

5. మంగ‌ళ‌గిరి (గుంటూరు జిల్లా)

6. క‌నిగిరి (ప్ర‌కాశం జిల్లా)

7. డోన్‌ (క‌ర్నూలు జిల్లా)

పార్లమెంటు స్థానాలు

1. అనంత‌పురం

2. క‌డ‌ప‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *