నాతో కలిసి దశాబ్దం నడిస్తే పాలనేంటో చూపిస్తా : జనసేనాని

అనంత వెనుకబాటుతనంపై దీక్ష చేస్తానని జనసేన అధ్యక్షుడు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అనంతపురంలోని శ్రీ సెవెన్‌ కన్వెక్షన్‌హాల్‌లో కరవు, నిరుద్యోగం, వలసలపై విద్యార్థులతో జనసేనాని ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై అధినేతతోపాటు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఉన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధి, కరవు ఇంకా ఇతర సమస్యల పై చర్చించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశామని.. సమస్యలను సూటిగా జనసేనకు తెలియజేస్తే.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థి ఒక్కో సమస్య జనసేన దృష్టికి తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించారు. వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులతో రెండున్నర గంట పాటు సాగిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా పవన్‌ వి ద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సమాదానాలు ఇస్తూ. చివరిగా అనంత వెనుకబాటుతనం పై దీక్ష చేసే రోజు దగ్గరలో ఉందని ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు చేశారు. రాయలసీమ యువత నాతో కలిసి దశాబ్ద కాలం నడిస్తే ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు.

కోస్తాంధ్రకంటే రాయలసీమ జిల్లాల్లోనే అత్యధికంగా విద్యాలయాలు, గ్రంథాలయాలు ఉన్నాయన్నారు. ఈ సీమకు ఙ్ఞాన సీమగా గుర్తిస్తే.. బాగుంటుందని సూచించారు. చలనచిత్ర పితామహుడు బిఎన్‌ రెడ్డి, తొలి కథానాయకుడు చిత్తూరు నాగయ్యలాంటి మహనీయులు పుట్టిన గడ్డ అన్నారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రదేశంలో చాలా గొప్ప వారిని చూశానని చెప్పారు. ఉపాధి అవకాశాలు రావడం లేదంటే వాటి మూలాలను పరిశీలించాలన్నారు. రాయలసీమలో నీటి ఎద్దడి ఒకటే సమస్య కాదని.. ఉపాధి అవకాశాలు రావాలంటే అవినీతి రహిత రాజకీయాలు రావాలన్నారు. ఒక తరిమెల నాగిరెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి లాంటి వ్యక్తుల ఆశయాలను నేటి తరం యువత పై ప్రభావితం చేసేలా చూడాలన్నారు. కష్టాలను అధిగమించే శక్తి మానవ మేదస్సుకు ఉందన్నారు. మన దేశంలో పాలకులు కమీషన్ల కోసం చూపించే కక్కుర్తి, స్వార్థపు రాజకీయాలకు చూపించే శ్రద్ధ ఉపాధి చూపించే దిశగా ఉండదన్నారు. రాయలసీమ నుంచి మహానేతలు హైదరాబాద్‌ కేంద్రంగా పరిపాలన సాగించారు. నేటికీ టిడిపి ప్రభుత్వం అదే తప్పు చేస్తోంది. వేలాది పరిశ్రమలు హైదరాబాద్‌, అమరావతి లాంటి ముఖ్య పట్టణాలకే కాకుండా రాయలసీమ ప్రాంతానికి కూడా తీసుకురావాలన్నారు. గతంలో నేతలు అలా ఆలోచించకుండా రాయలసీమను మరింత కరవు సీమగా మార్చారన్నారు. ఇప్పటికైనా.. తెలుగుదేశం ప్రభుత్వం పరిశ్రమలను అటువైపు కాకుండా అనంత వైపు మళ్లించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *