చేనేతకు నేనే బ్రాండ్ అంబాసిడర్ ని : పవన్‌కల్యాణ్‌

డ్వాక్రా మహిళల తరహాలోనే చేనేతల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని, వారికి అంబాసిడర్‌గా ఉంటానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో ఆయన చేనేత కళాకారుల్తో రచ్చబండ కార్య క్రమాన్ని నిర్వహించారు. చేనేతలకు రుణాలిచ్చేందుకు ప్రస్తుత వాణిజ్య బ్యాంకులేవీ ముందుకు రావడంలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేయడంపై పవన్‌ తీవ్రంగా స్పందించారు.

చేనేతలకు రుణాలు మంజూరు చేసేందుకు ఓ ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి చేనేత కార్మికుడికి సొంత మగ్గం ఉచితంగా అందజేస్తామన్నారు. వారి ఉచితంగా విద్య, వై ద్య సదుపాయం కల్పిస్తామన్నారు. వారి కష్టార్జితం పిల్లల భవిష్యత్‌కు దాచుకుంటే చాలన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. చేనేత నేచుకునేందుకు ముందుకొచ్చే యువతకు ధర్మవరంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఉపకార వేతనాలిస్తామన్నారు. చేనేతలకు సొంత ఊళ్ళలోనే ఇళ్ళు నిర్మిస్తామన్నారు. ప్రత్యేక పరిస్థితులుగా పరిగణించి చేనేతలకు తక్కువ వయస్సులోనే పింఛన్లు ఇస్తామన్నారు. తల్లి వంటి చేనేత ఉనికిని పరిరక్షించుకుంటామన్నారు. రెండుమూడు చీరలు నేసి మార్కెట్‌కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితుల్ని తప్పిస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఊళ్ళో మొబైల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు.

చేనేత రంగాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేనేతకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌క ల్యాణ్‌ ప్రకటించారు. అక్కడికక్కడే కమిటీ విధివిధానాల్ని రూపొందించే బాధ్యతను పార్టీ నాయకుడు మధుసూదనరెడ్డికి అప్పగించారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. చేనేతపై జిఎస్‌టి తొలగింపునకు ప్రయత్నిస్తామన్నారు. చేనేతలుగా గుర్తింపు కార్డులకు మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధిస్తామన్నారు.

కులాలు ఉండకూడదంటూ ప్రకటనలిచ్చే రాజకీయ నాయకులు ముందుగా మీ వెనుకున్న నాయుడు, రెడ్డి వంటి తోకల్ని తీసేయండంటూ పవన్‌ సూచించారు. కులం అంటే పేరు కాదు.. వంశపారంపర్యంగా వచ్చిందన్నారు. పాఠశాల స్థాయి నుంచి కులాల మధ్య ఐక్యత తీసుకురావాలన్నారు. కామన్‌హాస్టల్స్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. చిన్న నాటి నుంచి అందరూ ఒక్కటేనన్న భావనను తెస్తామన్నారు.

సచిన్‌ వంటి క్రికెటర్‌కు వందల కోట్ల పన్ను మినహాయింపునిస్తారు. కానీ నిత్యం మనం ధరిం చే దుస్తులు నేసే చేనేతలపై పన్నుల భారం విధిస్తున్నారంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసమొచ్చే ఏ రాజకీయ నాయకుడు జిఎస్‌టి గురించి త్రికరణ శుద్దిగా మాట్లాడ్డంలేదన్నారు. దీనిపై మాట్లాడాలంటే వారికి భయమన్నారు. వారు చేసిన తప్పులే వారికి గుండె ధైర్యం లేకుండా చేస్తున్నాయన్నారు. చేతిమగ్గం తెలియని పవర్‌లూమ్స్‌ యజమానులు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. మగ్గాలపై నేసే చేనేతలు మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. చేనేతల ఆత్మహత్యల అనంతరం పరిహారం ఇస్తున్నారు తప్ప వారు చావాల్సిన అవసరం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హోటల్‌లో ఉండేందుకు వందలకోట్లు వ్యయం చేస్తారు. అమరావతిలో స్పీడ్‌ బోట్ల కొనుగోలుకు వందలకోట్లు తగలేస్తారు. ధర్మపోరాట దీక్షల పేరిట కోట్లు ఖర్చుపెడుతున్నారు. కానీ చేనేతరంగంపై ఆధారపడ్డ వార్ని మాత్రం ఆదుకోవడం లేదన్నారు.

ఇలాంటి అవినీతి వ్యవస్థలో చేనేతకు అండగా ఉండేందుకే తాను పంచె ధరిస్తానని పవన్‌ చెప్పారు. చేనేతల కష్టాలు చూసే తాను చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారానన్నారు. చేనేతల్తో తనకు చిన్ననాటి నుంచి అనుబంధముందన్నారు. వారి కష్టాల్ని దగ్గరుండి చూశానన్నారు. 30ఏళ్ళకే కంటిచూపు పోయి 40ఏళ్ళకే వెన్నెముక దెబ్బతిని మగ్గం నేసి నేసి పొట్ట ఆర్చుకుపోయే పరిస్థితులు తనకు తెలున్నారు. వారి సమస్యలపై సమగ్ర అవగాహనున్న తాను వాటన్నింటిని పరిష్కరించి చూపిస్తానని హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *