జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు ముద్ర అవసరంలేదు – పవన్

జనసేన తమ రాజకీయ ప్రత్యర్థి కాదనీ, దాన్ని తాము రాజకీయ పార్టీగానే పరిగణించడం లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంతకుముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి టీడీపీ మాత్రమేనని ఆయన ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇస్తే పవన్ కల్యాణ్ కాల్షీట్ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన ఎద్దేవా చేశారు. తాజాగా అనంతపురంలో ఈరోజు జనసేన పోరాట యాత్రలో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తించనంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ గుర్తించనంత మాత్రాన తమకు ప్రజల్లో గుర్తింపు లేనట్లు కాదన్నారు. తాను ఒక్క పిలుపు ఇస్తే లక్ష మంది కవాతులో పాల్గొన్నారనీ, జనసేనకున్న శక్తి అదేనని తెలిపారు. జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదన్నారు. జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ, అసెంబ్లీకి వెళ్లడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. అనంతపురంలో కరవుతో ఉపాధి లేక రైతులు, చేనేతలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. రాయలసీమ యువత ఉపాధి కోసం వలసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరవుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సుదీర్ఘ కాలానికి వర్తించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇజ్రాయెల్ తరహాలో తక్కువ భూమిలో, తక్కువ నీటితో పంటలు పండించే దిశగా యువత దృష్టి సారించాలని సూచించారు. అనంతపురం కరువుతో సతమతం అవుతుంటే వాస్తవాలు బయటకు రాకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.‘మా ప్రాంతం నుంచి పోటీ చేయండన్నా’ అంటూ ఏపీ అంతటా ఉన్న జనసేన కార్యకర్తలు తనను కోరుతున్నారనీ, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ఫిబ్రవరి లో ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *