మనవడికి ఎంపీ సీటు త్యాగం..

దేవెగౌడ ఫ్యామిలీ నుంచి మరో కొత్త నేత రాజకీయాల్లోకి ఇచ్చారు. కర్నాటక మంత్రి HD రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ప్రజ్వల్‌కు తన సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. హసన్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజ్వల్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు దేవెగౌడ. మనవడి పేరును ప్రకటిస్తున్న సమయంలో కంటతడిపెట్టుకున్నారు. తనలాగే ప్రజ్వల్‌ని కూడా ఆదరించాలని ప్రజలను కోరారు. తాత కన్నీళ్లను చూసి మనవడు ప్రజ్వల్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

హెలెనర్సీపూర్ తాలుకా ముదలహిప్పి గ్రామంలో జరిగిన జేడీఎస్ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు దేవెగౌడ. ఐతే తన సిట్టింగ్ స్థానాన్ని మనవడికి కేటాయించడంతో దేవెగౌడ ఎక్కడి నుంచి పోటీచేస్తారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మరేదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా? లేదంటే వయసు పైబడడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, హసన్‌లో ప్రజ్వల్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఏ.మంజు పోటీకి దిగుతున్నారు.

మరో మనవడు నిఖిల్ (సీఎం కుమారస్వామి కుమారుడు)ని సైతం దేవెగౌడ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిఖిల్‌కు టికెట్ కేటాయిస్తారని సమాచారం. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జేడీఎస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *