జనసేన కార్యకర్తలపై టీడీపీ అక్రమ కేసులు : నాగబాబు

జనసేన కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని సినీ నటుడు నాగబాబు ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులో నాగబాబు మెగా అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం పనిచేయాలని మెగా అభిమానులకు నాగబాబు పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోనప్పటికీ వచ్చే ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన స్పష్టంచేశారు. తమ కార్యకర్తలను ఎంత వేధిస్తే తాము అంత పైకి ఎదుగుతామని అన్నారు. జనసేన కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి భయబెడితే తాము బెదరబోమన్నారు. జనసేన కార్యకర్తలపై చేయిపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒంటరివాడైనా…ఆయన వెంట అభిమానులు ఉన్నారన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారాన్ని కట్టబెట్టి టీడీపీకి బుద్ధి చెప్పాలని నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు పెరిగిపోయాయని, వీటి నుండి బయట పడాలంటే పవన్‌ లాంటి వ్యక్తులు అధికారంలోకి రావాలన్నారు. మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ జనసేనకు అండగా నిలవాలని కోరారు. ఎన్నికలలో అధికార యంత్రాంగం నిజాయతీగా వ్యవహరించాలని, అధికార ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని నాగబాబు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *