ఈడీ కేసులో ఆధారాలు బయటపెట్టిన టీడీపీపార్టీ

హైదరాబాద్: ఈడీ కేసులో విచారణ తప్పించుకునేందుకే మోదీతో జగన్ అవగాహనకు వెళ్లారంటూ టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. హిందూజా కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని, చర్యలు తీసుకోండని సీబీఐకి నాటి ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకొచ్చింది. లేఖ రాసి రెండేళ్లయినా కేంద్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో హిందూజాకు 100 ఎకరాల భూమి కేటాయించారని, అందులో జగన్ బినామీ సంస్థలకు హిందూజా గ్రూపు 11 ఎకరాలు ఇచ్చిందని తేలింది. క్విడ్ ప్రోకోకు ఆధారాలు ఉన్నాయని, మరింత లోతుగా విచారణ జరిపితే చాలా విషయాలు బయటకొస్తాయని సీబీఐకి ఈడీ డైరెక్టర్ లేఖ రాశారు.

జగన్‌తో ఒప్పందం కారణంగానే ఆ లేఖ, విచారణను కేంద్రం తొక్కిపట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. 2017లో ఈడీ లేఖ రాసిన తర్వాత పీఎంవోతో సాయిరెడ్డి ఒప్పందానికి వెళ్లారని టీడీపీ ఆరోపించింది. జగన్ బినామీ సంస్థలకు ఇచ్చిన 11 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. కేసీఆర్, జగన్‌, బీజేపీకి మధ్యవర్తిత్వం చేస్తున్నారనేందుకు ఇంతకన్నా ఏం ఆధారం కావాలని టీడీపీ నిలదీసింది. ఈడీ డైరెక్టర్ లేఖ విడుదలతో రాజకీయంగా కలకలం రేగింది. జగన్, మోదీ, కేసీఆర్ లింకు ఈ దెబ్బతో బయటపడిందని టీడీపీ స్పష్టం చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు సాగకపోవడానికి, జగన్‌కి కేసీఆర్ సాయం చేయడానికి కారణమేంటో ఈ లేఖతో బట్టబయలైందని టీడీపీ వాదిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *