నేను త‌ప్పు చేసినా సరే పార్టీ నుంచి త‌ప్పించ‌గ‌లిగే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుంది : శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్

జ‌న‌సేన పార్టీకి ఉన్నబ‌లాన్ని రాత్రికి రాత్రి ఓ వ్య‌వ‌స్థ‌గా మార్చేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయంగా అనుభ‌వం ఉన్న కుటుంబం నుంచి రావ‌డంతో నాటి కాంగ్రెస్ బ‌లం ఇప్పుడు ఆయ‌న పార్టీ బ‌లంగా మారింద‌నీ, రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే క్షేత్ర స్థాయిలో బ‌లం పుంజుకుని ఉంద‌నీ తెలిపారు. ఇలాంటి పార్టీల‌ని ఢీ కొట్టాలంటే అంత‌కు మించిన బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌ను నిర్మించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

బుధ‌వారం విశాఖ సాయిప్రియా రిసార్ట్ లో శ్రీకాకుళం జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యారు. వారికి దిశానిర్ధేశం చేసే క్ర‌మంలో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు క‌మిటీల ఏర్పాటు, పార్టీ విస్త‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ “నేను త‌ప్పు చేసినా పార్టీ నుంచి త‌ప్పించ‌గ‌లిగే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుంది. మేధావులు, అనుభ‌వ‌జ్ఞుల‌కి ఎక్క‌డ‌, ఎలా స్థానం క‌ల్పించాల‌న్న అంశంపై ఆలోచ‌న చేస్తున్నాం. ప్ర‌స్తుతం పార్ల‌మెంట‌రీ స్థాయి క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాం. ఒక్కో పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికీ 11 మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటీ ఏర్పాటు చేస్తాం. క‌మిటీ స‌భ్యులంద‌రికీ దిశానిర్ధేశం చేసేందుకు  ఒక చైర్మ‌న్ తోపాటు, పాల‌నా విభాగం, న్యాయ విభాగం, స్పీక‌ర్ ప్యాన‌ల్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్యాన‌ల్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి అన్ని ర‌కాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుంది. ఈ క‌మిటీ కాలప‌రిమితి నాలుగు నెల‌లు మాత్రమే. నా అనుభ‌వం, బ‌ల‌మైన ఆలోచ‌న , దూర‌దృష్టితో ఆలోచించి ఈ క‌మిటీకి రూప‌క‌ల్ప‌న చేశాం. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల క‌మిటీ, స‌బ్ క‌మిటీల వివ‌రాలు మ‌రో రెండు, మూడు రోజుల్లో ప్ర‌క‌టిస్తాం. వారానికి ఓసారి సామాన్యుడితో పార్టీ అధ్య‌క్షుడు కూర్చునేలా పార్టీ నిర్మాణం జ‌రుగుతోంది.  ఎంత మంది వ‌చ్చి చేరినా చెక్కు చెద‌ర‌ని వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తాం. ల‌క్ష‌ల కోట్ల బ‌డ్డెట్ ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌ను తీర్చ‌లేక‌ పోయింది. ప్ర‌జ‌ల‌కి స్వ‌చ్ఛ‌మైన తాగునీటిని అందించ‌లేక‌పోయింది. శ్రీకాకుళం జిల్లా నుంచి  వ‌ల‌స‌లు ఆప‌లేక‌పోయింది. జ‌న‌సేన రాత్రికి రాత్రి అద్భుతాలు చేసేస్తుంద‌ని చెప్ప‌ను. అద్భుతాలు నాలుగేళ్ల‌లో జ‌ర‌గ‌వు.

ఒక్కొక్క‌సారి నాలుగు ద‌శాబ్ధాలు అయిన జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు పోరాడుతూనే ఉండాలి. భావి త‌రాల భ‌విష్య‌త్తుకు అండ‌గా ఉండేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. మార్పు ఉద్ధానం నుంచి మొద‌లైంది. ప్ర‌పంచం క‌దిలింది. మార్పు సాధించి తీరుతాం. డ‌బ్బులు పంచాల్సిన అవ‌స‌రం లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డమే జ‌న‌సేన ల‌క్ష్యం. 2019 ఎన్నిక‌లు మ‌న‌ బ‌ల‌మైన పోరాట ప‌టిమ‌కు, ప్ర‌జ‌లు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఉన్న అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండు అవినీతి మ‌కిలితో నిండిన పార్టీలేన‌న్న సంగ‌తి తెలుసు. అయితే బుర‌ద మ‌ధ్య క‌మ‌లం విక‌సించిన‌ట్లు జ‌న‌సేన విక‌సిస్తుంది. రాజ‌కీయాల్లో ఒక్క‌సారి దెబ్బ‌తిన్నాం క‌నుక ప్ర‌తి అడుగు ఆచితూచి వేస్తున్నాం. నేను త‌క్కువ చెబుతాను.. ఎక్కువ చేస్తాను. జ‌న‌సైనికులే జ‌న‌సేన బ‌లం. ఏమీ ఆశించ‌కుండా కేవ‌లం న‌న్ను చూసి, నేను స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విధానం న‌చ్చి ఇంత మంది ముందుకి వ‌చ్చారు. జ‌న‌సైనికులంద‌రినీ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఒక గొడుకు కిందకి తీసుకురావాల‌న్న‌దే నా త‌ప‌న‌. అందుకు త‌గిన‌ట్టు ప‌నిచేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు అల‌వాటు ప‌డాలి. జ‌న‌సేన నిర్మాణం ఎలా వుండాలి అంటే, అది మొత్తం దేశాన్ని ప్ర‌భావితం చేసే విధంగా ఉండాల‌”ని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *