‘ఆత్మ’ కు సమంత తోడు

చిన్మయి.. దక్షిణాది సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. ఆమె పాడిన పాటలు.. మిగతా వాళ్లకు చెప్పిన డబ్బింగ్ అంతా ఒకెత్తయితే.. సమంతకు వివిధ సినిమాల్లో చెప్పిన డబ్బింగ్ మరో ఎత్తు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత పాత్ర అంత బాగా ఎలివేట్ కావడానికి, ప్రేక్షకులు ఆమెతో ప్రేమలో పడిపోవడానికి చిన్మయి డబ్బింగ్ కూడా ఒక ముఖ్య కారణం. 

ఆ ఒక్క సినిమాతో ఒకేసారి స్టార్ హీరోయిన్ అయిపోయింది సామ్. అప్పట్నుంచి సమంతకు దాదాపుగా ప్రతి సినిమాలో చిన్మయినే డబ్బింగ్ చెబుతోంది. అందుకే ఆమెను సమంత ఆత్మగా చెబుతారు జనాలు. తన కెరీర్ ఎదుగుదలకు ఇతోధికంగా సాయపడ్డ చిన్మయిపై సమంతకు చాలా అభిమానమే ఉంది. ఆ అభిమానంతోనే చిన్మయిని తన క్లోజ్ ఫ్రెండ్‌గా మార్చుకుంది.

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్‌ కూడా సమంతకు మంచి ఫ్రెండ్. వీళ్లిద్దరికీ ఏవైనా ఇబ్బందులు తలెత్తినా సపోర్ట్ చేయడానికి సామ్ ఎప్పుడూ ముందుంటుంది. గత ఏడాది ‘మీ టూ’ మూమెంట్లో భాగంగా చిన్మయి పలువురిపై సంచలన ఆరోపణలు చేయడం, అనేకమంది బాధిత మహిళలకు మద్దతుగా పోరాడటం తెెలిసిన సంగతే. ఆ సందర్భంలో ప్రతిసారీ చిన్మయికి సమంత సపోర్ట్ ఇచ్చింది. ఈ పోరాటానికి ప్రతిఫలంగా చిన్మయి తమిళ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. అక్కడ డబ్బింగ్ యూనియన్ ఆమెపై వేటు వేసింది. గాయనిగానూ అవకాశాలు ఆగిపోయాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో సమంత.. చిన్మయికి తెలుగులో ఛాన్సులు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. తన కొత్త సినిమా ‘మజిలీ’లో ఒక పాట పాడే ఛాన్స్ కల్పించింది సామ్. ఆమె పాడిన ‘ప్రియతమా ప్రియతమా’ పాట సోమవారం రిలీజై ఇన్‌స్టంట్ హిట్టయింది. ఈ సందర్భంగా ఈ పాట పాడే అవకాశం సమంతే ఇప్పించిందని వెల్లడిస్తూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది చిన్మయి. ఐతే సమంత మాత్రం.. థ్యాంక్స్ అక్కర్లేదని.. అది ఆమె టాలెంట్ అని.. దాన్ని ఉపయోగించుకోని వాళ్లే నష్టపోయినట్లు అని పరోక్షంగా కోలీవుడ్ జనాలపై సెటైర్ వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *