బీజేపీకి బిగ్ షాక్…జనసేనలోకి బీజేపీ ఫ్లోర్ లీడర్!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని గౌరవనీయ స్థానాలను గెల్చుకున్న కమలదళానికి ఈ దఫా మాత్రం పరిస్థితులు అత్యంత క్లిష్టతరంగా కనిపిస్తున్నాయి. టీడీపీతో విభేదాల సంగతి అటుంచితే.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందనే భావన ఏపీ ప్రజల్లో బలంగానే నాటుకుపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి ధైర్యంగా వెళ్లలేకపోతున్నారు. క్రమంగా వారు పార్టీని వీడుతున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో బీజేపీకి పెద్ద షాక్ తగలబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సీనియర్ నేత పి.విష్ణు కుమార్ రాజు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.

విష్ణు కుమార్ రాజు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రత్యేక హోదా విషయంలో చెలరేగిన వివాదంతో రాష్ట్రంలో బీజేపీ మనుగడ ఇక కష్టమని ఆయన భావిస్తున్నారట. అందుకే ఎన్నికలు సమీపిస్తున్నవేళ తన రాజకీయ భవిష్యత్తును రక్షించుకునేందుకుగాను పార్టీని వీడాలని యోచిస్తున్నారట.

నిజానికి తనకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని విష్ణు కుమార్ రాజు గతంలో మీడియా ముందు చెప్పారు. తానే ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం వైసీపీ టికెట్ విషయంలో హామీ ఇవ్వలేదని.. విష్ణు కుమార్ రాజు టీడీపీలో చేరడం ఖాయమైందని కూడా వార్తలొచ్చాయి. అప్పట్లో ఆయన వైఖరి కూడా ఆ వార్తలు నిజమనేలానే కనిపించింది. అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టినందుకు – పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నందుకు సీఎం చంద్రబాబునాయుడిపై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. టీడీపీలో చేరే ఆలోచనను విష్ణుకుమార్ రాజు విరమించుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుపై ఆయన చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. విష్ణుకుమార్ రాజు – చంద్రబాబుల మధ్య అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణు కుమార్ రాజు జనసేనలో చేరబోతున్నారంటూ ప్రస్తుతం వార్తలొస్తున్నాయి. పవన్ కల్యాణ్ మద్దతు లేకపోయి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యుండేవారే కాదని.. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను బలోపేతం చేస్తున్నాయి. అయితే – బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్న పవన్ విష్ణుకుమార్ రాజును పార్టీలోకి ఆహ్వానిస్తారా? లేదా? అనే సంగతి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *