మేము ‘అనుకున్న వ్యూహం’ ఫెయిలైంది

పుణె: అనుకున్న విధంగా వ్యూహాలు అమలు చేయలేకపోవడంతోనే మూడో వన్డేలో ఓటమి పాలైనట్లు భారత సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ‘విండీస్‌ మా ముందు ఛేదించదగ్గ లక్ష్యాన్నే ఉంచింది. కానీ మేము ఛేదించే క్రమంలో సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. మైదానంలో మేం మెరుగ్గానే రాణించాం. కానీ విజయం సాధించడానికి మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 43పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. అంతకుముందు మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. మొదటి 35ఓవర్లు వరకూ విండీస్‌ను కట్టడి చేస్తూనే వచ్చాం. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగించి ఉంటే మా ముందు లక్ష్యం 260లోపే ఉండేది. కానీ చివరి పది ఓవర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపించిందన్నారు.

మరోవైపు విండీస్‌ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తమకంటూ అవకాశం వస్తే విండీస్‌ ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు అని కోహ్లీ అన్నాడు. జట్టులో సరైన ఆల్‌రౌండర్‌ లేకపోవడం కూడా లోటేనని ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *